కనకమహాలక్ష్మి కో-ఆపరేటివ్ బ్యాంకుకు బ్లూ రిబ్బన్ అవార్డు

కనకమహాలక్ష్మి కో-ఆపరేటివ్ బ్యాంకుకు బ్లూ రిబ్బన్ అవార్డు



విశాఖపట్నం: జాతీయస్థాయిలో కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులకు నిర్వహించిన వ్యాపార పోటీల్లో భాగంగా విశాఖపట్నంనకు చెందిన ది కనకమహాలక్ష్మి కో-ఆపరేటివ్ బ్యాంకుకు 3వ స్థానం లభించింది. ఈ మేరకు ఇటీవల గోవాలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవంలో బ్యాంకుకు బ్లూ రిబ్బన్ అవార్డు 2020 బహుమతిని నిర్వాహకులు అందజేశారు. బ్యాంకు హెమోర్ మేనేజర్ ఎస్ఎం.శ్రీనివాస్ కార్యక్రమానికి హాజరై అవార్డును అందుకున్నారు. రూ.400 కోట్లు నుంచి రూ. 600కోట్లు వ్యాపారం చేసిన వారిలో అత్యుత్తమ ప్రతిభ కనబరచి 70 పాయింట్లకు పైగా వచ్చిన వారికి ఈ అవార్డును అందజేశారు. దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఈ పోటీల్లో తమ బ్యాంకుకు 3వ స్థానం దక్కడం చాలా సంతోషంగా ఉందని బ్యాంకు వ్యవస్థాపక అధ్యక్షులు పరుచూరి రఘునాధరావు, ముఖ్య కార్యనిర్వాహణాధికారి కె.శ్యామ్ కిశోర్ ఆనందం వ్యక్తం చేశారు. ఖాతాదారుల ఆదరణ, సిబ్బంది అందిస్తున్న మెరుగైన సేవలు వల్లనే తమకీ అవార్డు దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. రానున్న కాలంలో మరిన్ని అవార్డులను పొందే విధంగా బ్యాంకు కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు.


కార్మిక సమస్యలపై రాజీలేని పోరాటం


గాజువాక : కార్మిక సమస్యల పై రాజీలేని పోరాటం చేస్తానని ఐఎన్‌టియుసి ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్ అన్నారు. స్టీల్‌ప్లాంట్ సెంట్రల్ స్టోర్ వద్ద  ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మిక సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఇంటర్ ముందుకు సాగుతుందన్నారు. కార్మికుల వేతన ఒప్పంద చర్చలు తక్షణమే ప్రారంభించాలని, కార్మికులకు భద్రత కల్పించేందుకు యాజమాన్యం ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంధం వెంకట్రావు, రఫి, ఎల్‌వి.రమణయ్య, ఆర్.జగదీష్, వేణువర్మ, రామారావు, గంగవరం గోపి పాల్గొన్నారు.


గంగవరం పోర్టు కార్మికులకు అన్యాయం


గాజువాక : జీతాలు పెంపుదలలో గంగవరంపోర్టు యాజమాన్యం కార్మికులు తీవ్ర అన్యాయం చేసిందని సిఐటియు నాయకులు బి.ఢిల్లీరావు, కె.మహేష్ పేర్కొన్నారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయని, పోర్టు కార్మికులకు జీతాలు మాత్రం చాలా స్వల్పంగా పెంచారని తెలిపారు. న్యాయంగా కార్మికులకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు.


ఖోఖో, కబడ్డీలో అక్కిరెడ్డిపాలెం విద్యార్థుల ప్రతిభ


గాజువాక : కణితి జిల్లా పరిషత్ పాఠశాలలో  గాజువాక మండలస్థాయి ఆటలపోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో అక్కిరెడ్డిపాలెం జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబర్చి ఖోఖో, కబడ్డీ, టెన్నికాయిట్ పోటీల్లో విజయకేతనం ఎగరవేశారు. గాజువాక నుంచి అన్ని పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొనగా తమ పాఠశాల విద్యార్థులు మాత్రం మండల స్థాయి ఆటలపోటీల్లో గెలుపొందడం ఆనందంగా ఉందని పాఠశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మహ్మద్ ఇస్మాయిల్ తెలిపారు. ఈ సందర్భంగా గెలుపొందిన వారికి ప్రధానోపాధ్యాయులు ఎస్ఎంఎన్.నవమాలని, పిఎంసి చైర్మన్ మహేశ్వరరావు విద్యార్థులకు అభినందించారు.